తెలంగాణలో అవినీతి పాలకులపై ఐటీ, ఈడీ దాడులేవి?

తెలంగాణలో అవినీతి పాలకులపై ఐటీ, ఈడీ దాడులేవి?

వచ్చిన తెలంగాణ ఆగమైతున్న తీరును అడ్డుకునేందుకు 4 ఏండ్ల క్రితం అనేక మంది తెలంగాణ ఉద్యమ నాయకులు బీజేపీలో చేరారు.  మూడున్నర ఏండ్లలో అవినీతి, కుటుంబ పాలననే ఒక నరెటివ్​ గా తయారు చేసిన బీజేపీ తెలంగాణలో అమాంతం తన పాపులారిటీని పెంచుకుంది. ఇక ప్రత్యామ్నాయం ఆ పార్టీయే అనేంత దాకా వెళ్లింది. దాంతో ఆ పార్టీ గ్రాఫ్​ ఏస్థాయిలో పెరిగిందో, ఇవాళ అదే స్థాయిలో ఎందుకు పడిపోయింది?

ఇపుడు ఎన్నికల్లో ఆ పార్టీ తొంబయి స్థానాల్లో  సీరియస్​ పోటీలో ఎందుకు లేకుండాపోయింది? కానీ ఆ విషయ రహస్యం పార్టీ ఢిల్లీ పెద్దలకు తెలియదని ఎవరనుకుంటారు? అందుకే  ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరమూ ఉండకపోవచ్చు. కానీ, తెలంగాణ ఉద్యమకారులు ఆత్మను చంపుకొని  ఆపార్టీలో ఉండలేకపోయిన పరిస్థితులను ఎవరు కాదంటారు? ఇవాళ వారిపైనే ఐటీ, ఈడీ దాడులతో కుట్రలకు తెర లేపడం ఎవరికోసం? 

నా లుగేండ్లు బీజేపీ  ప్రత్యామ్నాయంగా ప్రజలను నమ్మించి గ్రాఫ్​ పెంచుకుంది. పెరిగిన ఆ గ్రాఫ్​లో తెలంగాణ ఆకాంక్షలున్నాయి. కేసీఆర్​ అహంకార పోకడ, అవినీతి పాలన పోవాలనే లక్ష్యం ఉంది. నిరుద్యోగుల రోదన ఉంది. అంతరిస్తున్న  ప్రభుత్వ విద్యను, కార్పొరేట్​ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే ఉన్నతాశయం ఉంది.  ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన భారీ అవినీతిని వెలికి తీసి తెలంగాణ సంపదను కాపాడతారనే నమ్మకం ఉండింది. ధరణి రహస్యాలు, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, ఇసుక మాఫియాలు, లిక్కర్​ మాఫియాలు కొల్లగొట్టిన తెలంగాణ సంపదను తిరిగి కాపాడగలరనే విశ్వాసం ఉండింది. అవే  తెలంగాణలో బీజేపీ ప్రజాదరణను పెంచాయి.   తెలంగాణ ప్రజలు బీజేపీని ఎందుకు నమ్మారో ఆ పార్టీ అధిష్టానానికి తెలియదనుకోవచ్చా? మూడున్నరేండ్లుగా  అరుపులు తప్ప దర్యాప్తులు పట్టని బీజేపీ ప్రజాదరణ ఆరునెలల్లోనే  కరిగిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? 

కాంగ్రెస్​కు ‘మౌత్​ టాక్’​ 

ఈ మధ్య నేషనల్​ ఛానెల్​ ఏబీపీలో  యాంకర్​తెలంగాణలో బీజేపీ గురించి  మంచి ఆసక్తికరమైన కామెంట్​ చేసింది. ‘ బీజేపీ  తెలంగాణలో  బీఆర్​ఎస్​ను కాకుండా, కాంగ్రెస్​ను ప్రత్యర్థిగా ఎంచుకున్నది. అందుకే తెలంగాణలో బీజేపీ  గ్రాఫ్ బాగా పడిపోయి, కాంగ్రెస్​ వైపు మళ్లింది’ అని  ఆ యాంకర్​ చేసిన కామెంట్ చాలు.. తెలంగాణలో బీజేపీ ఒక్క కేసీఆర్​ కోసం తనకు తానే చేసుకుంటున్న తప్పేమిటో చెప్పడానికి! ఆగమైన తెలంగాణను కాపాడుతుందనుకున్న బీజేపీపై ఆశలు ఆవిరైన ఉద్యమ నాయకులంతా ఎవరి మానాన వారు ఆ పార్టీ నుంచి బయటకు రాకతప్పలేదు.

తెలంగాణ ప్రజల కన్నా, కేసీఆరే  ముఖ్యం అనుకుంటున్న బీజేపీ రాజకీయమే ఇవాళ తెలంగాణలో ఆ పార్టీకి ఒక శాపం.  కేసీఆర్​ ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి పెరిగిన గ్రాఫ్​ కాస్తా ఇవాళ కాంగ్రెస్​ వైపు మళ్లింది. అందుకే ఇవాళ తెలంగాణలో  ఎక్కడ చూసినా ‘కాంగ్రెసే గెలవనుంద’నే ‘మౌత్​ టాక్​ వినబడుతుంది. అది ఎవరి పుణ్యమో తెలుసుకోవలసింది మోదీ, అమిత్​ షాలే! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితముంటదా? 

బలమైన ప్రతిపక్షానికే ఓటు

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తప్ప పార్టీ ఓటు అంటూ లేదు.  బీఆర్​ఎస్​ను ఏ పార్టీ ఓడించగల స్థితిలో ఉంటే ఆపార్టీకే ఓటేయాలనేది  ప్రభుత్వ వ్యతిరేక ఓటరు మనోగతాన్ని 2019లో చూశాం.  అయితే ఇవాళ  బీఆర్​ఎస్​ అవినీతిపై అరుపులు తప్ప దర్యాప్తులు జరపని బీజేపీపై విశ్వాసం తగ్గి, ప్రభుత్వ వ్యతిరేక ఓటరు కాంగ్రెస్​ వైపు మళ్లుతున్నాడు.  దాంతో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క పార్టీకే పోలరైజ్​ అవుతున్న పరిస్థితికి ఎవరు కారకులో బీజేపీ తనకు తానే ఆత్మపరిశీలన చేసుకోవాలె.  తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్​ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వివేక్​ లాంటి ఉద్యమ నాయకులు బీజేపీని వదలకపోతే తప్పు తప్ప, వదిలితే తప్పని ఎవరూ అనుకోవడం లేదు.

అవమాన ఘటనలు ప్రజల్ని నమ్మించగలవా?

రెండేండ్లుగా ప్రధానికే ప్రొటోకాల్​ పాటించని ముఖ్యమంత్రి కేసీఆర్​ను కేంద్రం ఏనాడైనా హెచ్చరించిందా? సిద్ధిపేట రైల్వేస్టేషన్​లో ఒక రాష్ట్ర మంత్రి ప్రధాని మోడీ ఫ్లేక్సీని చించేసి టీవీని ఎత్తేసినా ఆ మంత్రిపై రైల్వే పోలీసులు  కేసు నమోదు చేయలేదంటే, అది ఏ సంబంధం అనుకోవాలె?  ఒక కేంద్ర క్యాబినెట్​ మంత్రిని  సీఎం కేసీఆర్​ ‘రండ మంత్రి’ అని సంబోధించినా తుడిచేసుకుపోవడం దేనికి సంకేతం?  రెండు పార్టీల మధ్య అవగాహనతో జరుగుతున్న ఘటనలే అనుకోవాలా? 4 ఏండ్లలో ఇలాంటి ఘటనల కోకొల్లలు.  

తెలంగాణకు ఆయనొక అసెట్​

నాలాంటి ఉద్యమ నేతపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయంటే,  కేసీఆర్​ డైరెక్షన్​లో​ బీజేపీ పని చేస్తున్నదనడానికి ఇంకేం సాక్ష్యం కావాలంటున్న వివేక్​  వెంకటస్వామి కామెంట్​కు,  బీజేపీ దగ్గర జవాబు ఉన్నదా?  వివేక్​  పొలిటికల్​ ఫ్యామిలీ నుంచి ఎదిగొచ్చిన నాయకుడు. ఆయన తండ్రి  కాంగ్రెస్​ వెటరన్​ లీడర్​ వెంకటస్వామి స్వయాన తెలంగాణ వాది. వివేక్​ కాంగ్రెస్​ ఎంపీగా ఉంటూనే పార్లమెంటులో సహచర కాంగ్రెస్​ ఎంపీలతో కలిసి తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడారు.

తెలంగాణ నుంచి ఎదిగొచ్చిన అరుదైన పారిశ్రామికవేత్త ఆయన. ఇంకా చెప్పాలంటే, తెలంగాణ గర్వించదగ్గ పారిశ్రామికవేత్త. పొద్దునలేస్తే ఆంధ్రా  పారిశ్రామికవేత్తలు, ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం పనిచేసే కేసీఆర్​ పాలనలో వివేక్​ లాంటి తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు దక్కిన  గౌరవం ఎంత?    తెలంగాణ ఉద్యమానికి గొంతు లేని నాడు వీ6 ఛానెల్​ స్థాపించి బలమైన గొంతును అందించాడాయన. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తన చానెల్​ ద్వారా ఇప్పటికీ కాపాడుతున్న అరుదైన తెలంగాణ నాయకుడాయన. తెలంగాణకు ఆయనొక అసెట్​.

తెలంగాణే ఆయన రాజకీయ జీవితం

వివేక్​ ఏ పార్టీలోకి వెళ్లినా తెలంగాణ కోసమే వెళ్లాడు. ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం తన పార్టీ(కాంగ్రెస్​)ని సైతం ఎదిరించి పోరాడిన చరిత్ర ఆయనది. టీఆర్​ఎస్​లో చేరినా నియంతృత్వం నచ్చక బయటపడక తప్పలే. తదుపరి బీజేపీలో చేరినా తెలంగాణ కోసమే చేరారు. బీజేపీ అయితేనే కేసీఆర్​ అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడగలదనే నమ్మకంతోనే ఆ పార్టీలో 4 ఏండ్లు కొనసాగారు. కేసీఆర్​ అవినీతిపై, కుటుంబ పాలనపై అరుపులు తప్ప దర్యాప్తులు లేకపోవడం చూశాక, వివేక్ వెంకటస్వామి నుంచి మొదలుకుంటే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి దాకా అనేక మంది ఉద్యమ నాయకులు బీజేపీని వీడక తప్పలేదనే విషయాన్ని ఎవరు కాదంటారు? పార్టీ కన్నా ప్రాంతానికి ప్రాముఖ్యమిచ్చే వివేక్​పై ఇవాళ ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయంటే,  ఎవరిపై, ఎవరు దాడులు జరిపిస్తున్నారో ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రా తాబేదార్లకు ఊడిగం చేయమరిగిన కేసీఆర్​ పాలనలో తెలంగాణ ఉద్యమ నాయకులను కాపాడుకోవలసింది మాత్రం ప్రజలే.  

దోపిడీ సౌధాలు పట్టవా?

తాను​  జాతీయ నాయకుడు  కావడానికి కేసీఆర్​ ఏం చేయాలనుకుంటున్నాడో  సీనియర్​ జర్నలిస్ట్​ రాజ్​దీప్​ సర్​దేశాయి చెప్పాడు. నన్ను జాతీయ నాయకుడిగా ఎన్నుకుంటే, ఆయా పార్టీలకు నేనే ఫండింగ్​ చేస్తాను అని స్వయాన కేసీఆరే తనకు చెప్పాడని రాజ్​దీప్​ ఇప్పటికే చెప్పాడు. తెలంగాణ సంపద ఎంత కొల్లగొడితే..  కేసీఆర్​ ఇతర పార్టీలకు అంత ఫండింగ్​ చేసి జాతీయ నాయకుడు కావాలనుకుంటున్నాడు?

ఈ విషయం బీజేపీ ఢిల్లీ పెద్దలకు పట్టదా? ఆయన దోపిడీ సౌధాలు పట్టవా? అలాగే, ఏడాది గడుస్తున్నా అరెస్టు కాని కవితను చూస్తున్నాం. కుంగిపోయిన కాళేశ్వరం చూస్తున్నాం. అనేక అవినీతి ఆరోపణలు వింటున్నాం. కానీ కేసీఆర్​ కుటుంబంపై ఈడీ, ఐటీ దాడులు ఎన్నడైనా విన్నామా?  కానీ, ఎవరో చేసిన ఫిర్యాదును ఆసరా చేసుకొని వివేక్​ వెంకటస్వామి లాంటి ఉద్యమ నాయకులపై మాత్రం గంటల్లో ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయి.  

 

కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​